Archive for January, 2012

ఐస్‌క్రీంను ఎవరు కనుగొన్నారు..?

పేద, ధనిక.. చిన్నా, పెద్దా.. తేడాలు లేకుండా అందర్నీ ఊరించే పదార్థం ఐస్‌క్రీం. మండువేసవిలో తియ్యగా, చల్లగా అలరించే ఐస్‌క్రీం రుచిని ఆస్వాదించని వారెవరూ ఉండరు. అయితే మొట్టమొదటిసారిగా ఈ ఐస్‌క్రీంను ఎవరు కనుగొన్నారు, దీన్ని ఎవరు తయారు చేశారు, అసలు ఇదెలా పుట్టింది..? లాంటి విశేషాల సమాహారాన్ని ఇప్పుడు చూద్దాం.

ఐస్‌క్రీం అనే పదార్థాన్ని మిగిలిన వంటల్లాగా ఎవరూ తయారు చేయలేదు. ఇది ఏ వంటగాడి చేతిలోనూ రూపుదిద్దుకోలేదు. పూర్వం రాజులు, జమీందార్లు, ధనవంతులు, సంపన్న వర్గాల ప్రజలు మత్తుపానీయాలను ఐస్‌తో చల్లబరిచి తీసుకునేవారు. ఆ తరువాత ఈ విధానమే ఐస్‌క్రీం తయారీకి ప్రేరణగా నిలిచిందని చెప్పవచ్చు.

ఇందులో భాగంగానే ఇంగ్లండ్ రాజ భవనంలో పనిచేసే వంటవాడు చల్లని ఓ పదార్థాన్ని తయారుచేసి రాజుకు వడ్డించాడట. అది భుజించిన రాజు దాని రుచికి ముగ్ధుడయ్యాడట. ఆ పదార్థమే ఐస్‌తో తయారైన ఐస్‌క్రీం. అయితే ఈ పదార్థం తయారీ రహస్యాన్ని ఎవరికీ చెప్పవద్దని ఆ వంటవాడి వద్ద ఇంగ్లండ్ రాజు మాట తీసుకుని, ఆ వంటవాడికి సంవత్సరానికి కొంత మొత్తం డబ్బును ముట్టజెప్పేవాడట.

అలా కాలం గడుస్తుండగా డబ్బుకు ఆశపడిన ఆ వంటవాడు ఐస్‌క్రీం తయారీ రహస్యాన్ని యూరోపియన్లకు వెల్లడి చేశాడట. అలా వంటవాడి ద్వారా యూరోపియన్లకు, వారి ద్వారా అమెరికన్లకు ఐస్‌క్రీం తయారీ రహస్యం వెలుగులోకి వచ్చింది. తదనంతరం న్యూజెర్సీకి చెందిన నాన్సీ జాన్సన్ అనే మహిళ సులభ పద్ధతిలో ఐస్‌క్రీంను తయారుచేసే చేతి మిషన్‌ను కనుగొంది. ఆ తరువాత ఐస్‌క్రీం తయారీ సులభంగా అందరికీ అందుబాటులో వచ్చింది.

ఆ తరువాత బాల్టిమోర్‌కు చెందిన జాకబ్ ఫన్సల్ తొలిసారిగా ఐస్‌క్రీం పార్లర్‌ని ప్రారంభించారు. ఆపై డెమాస్కన్ నుంచి వచ్చిన సిరియా దేశస్థుడు ఏ. హాంని ఐస్‌క్రీంలను కోన్‌లలో అమ్మటం ప్రారంభించాడు. అలా కొంతకాలం గడచిన తరువాత ఆవిరి, విద్యుత్‌శక్తులతో ఐస్‌క్రీంలను తయారు చేసే విధానం అభివృద్ధి చెందింది. రెండో ప్రపంచ యుద్ధకాలంలో బుర్టన్ బుచ్ బాస్కిన్ అనే వ్యక్తి తొలిసారిగా 31 రకాల ఐస్‌క్రీంలను తయారు చేశాడు. అలా చాక్లెట్, వెనీలా, స్ట్రాబెర్రీ రుచులు ప్రపంచానికి బాస్కిన్ ద్వారా పరిచయం అయ్యాయి. ఇక అప్పటినుంచి ఇప్పటిదాకా ఐస్‌క్రీం అనేక ఆధునిక పోకడలతో ప్రపంచ ప్రజలందరినీ చల్లచల్లగా అలరిస్తూనే ఉంది.

Leave a comment »

ఇంటర్నెట్ అంటే…

ప్రపంచ వ్యాప్తంగా ఉండే కంప్యూటర్లను అన్నింటినీ కలిపే ఒక వ్యవస్థే “ఇంటర్నెట్”. ఈ ఇంటర్నెట్‌నే తెలుగులో “అంతర్జాలం” అని సంభోధిస్తారు. 1969వ సంవత్సరంలో అమెరికా భద్రతా విభాగం అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ అయిన “ఆర్పా (ఏఆర్‌పీఏ)”లో ఇంటర్నెట్ తొలిసారిగా సృష్టించబడింది.

అలాగే 1990వ సంవత్సరంలో బ్రిటీషు శాస్త్రవేత్త అయిన టిమ్ బెర్నెల్స్ లీ స్విట్జర్లాండ్‌లోని సెర్న్ (సీఈఆర్ఎన్) వద్ద “వరల్డ్ వైడ్ వెబ్”ను సృష్టించాడు. దీనినే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ అని అంటారు. ప్రస్తుతం ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల (ఐఎస్‌పీ)కు కొంత మొత్తం డబ్బును చెల్లించి ఇళ్లలోనూ, కార్యాలయాల్లోనూ వాడుకునే కంప్యూటర్లను ఇంటర్నెట్‌కు అనుసంధానించవచ్చు. ఇలా ప్రపంచంలోని కంప్యూటర్లను అన్నింటినీ కలిపే వ్యవస్థే ఇంటర్నెట్.

ఈ వ్యవస్థలో ఉన్న కంప్యూటర్లు ఒకదానితో ఒకటి సంభాషించుకునేందుకు ఇంటర్నెట్ ప్రొటోకాల్ అనే నియమావళిని ఉపయోగిస్తుంటారు. ఇంగ్లీషులో ఇంటర్నెట్ అని రాసేటప్పుడు మొదటి అక్షరాన్ని ఎల్లప్పుడూ తప్పనిసరిగా కేపిటల్ లెటర్‌గానే రాయాల్సి ఉంటుంది.

ఇంటర్నెట్‌కు అనుసంధానమై ఉండే ప్రతి కంప్యూటర్ ఒక సంఖ్యను కలిగి ఉంటుంది. దీనినే “ఐపీ అడ్రస్సు” అని పిలుస్తుంటారు. ఇంటర్నెట్‌లో ఒక కంప్యూటర్ నుంచి మరొక కంప్యూటర్‌కు సందేశాలు ఈ ఐపీ చిరునామా ఆధారంగానే పంపించబడుతుంటాయి.

ఇక ఇంటర్నెట్ ద్వారా లభించే సేవలను చూస్తే.. గతంలో ఉత్తరాల ద్వారా సమాచారం పంపించినట్లుగానే, కంప్యూటర్లతో”ఎలక్ట్రానిక్ మెయిల్స్” ద్వారా క్షేమ సమాచారాన్ని పంపించవచ్చు. వీటినే ఈ-మెయిల్స్ అని అంటుంటారు. అలాగే “ఛాటింగ్” అనే సౌకర్యంతో ఇంట్లో కూర్చునే కంప్యూటర్ ద్వారా ప్రపంచంలో ఏ మూలనున్నవారితోనైనా గంటలతరబడీ బాతాఖానీ కొట్టవచ్చు. 

ఇంకా లైబ్రరీకి వెళ్లి పుస్తకాలు, పత్రికలు చదివటం కాకుండా ఇంట్లో కూర్చుని కంప్యూటర్ ముందే ప్రపంచంలోని అన్ని గ్రంథాలయాల్లోని పుస్తకాలను తిరగేసి విషయ సేకరణ చేయవచ్చు. ఇందుకోసం “వరల్డ్ వైడ్ వెబ్” ఎంతోగానో ఉపయోగపడుతుంది. ఇంటర్నెట్‌లో ఎక్కువగా ఉపయోగించేది కూడా దీన్నే. ఇందులో వెబ్‌సైటులు, బ్లాగులు.. లాంటి అనేక సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి.

వరల్డ్ వైడ్ వెబ్ తరువాత ఇంటర్నెట్‌లో ఎక్కువగా ఉపయోగించేది ఈ-మెయిల్స్‌నే. ఇందులో ఉత్తరాలను పంపించవచ్చు, ప్రత్యుత్తరాలు అందుకోవచ్చు. అయితే ఇక్కడ కాగితం అవసరం ఉండదు, కేవలం సమాచారం ఉంటే సరిపోతుంది. ఇంటర్నెట్‌లో రకరకాల సేవలను అందించే ప్రత్యేక వెబ్‌సైట్లను కూడా చూడవచ్చు. వీటనే పోర్టల్స్ అంటారు. ఇవి ఇప్పుడు తెలుగు భాషలో కుప్పలు తెప్పలుగా అందుబాటులో ఉంటున్నాయి.

అయితే ఇంటర్నెట్ వల్ల మంచి ఎంత ఉందో, చెడు కూడా అంతే స్థాయిలో జరిగే అవకాశం ఉంటుంది. అందుకనే ఇంటర్నెట్ వినియోగిస్తున్న పిల్లలను తల్లిదండ్రులు ఓ కంట కనిపెడుతూ ఉండాలి. పిల్లలు నెట్‌ను ఎందుకోసం వినియోగిస్తున్నారో గమనించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. ఒకవేళ వారు చెడుదారిలో నడుస్తుంటే ప్రారంభంలోనే గుర్తించి, పిల్లల్ని సక్రమైన దారిలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

ఇదిలా ఉంటే.. గంటలకొద్దీ నెట్‌లో గడిపేవారు క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉందని తాజా పరిశోధనల్లో వెల్లడైంది. అలాగే సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లను ఎక్కువగా సందర్శించేవారు క్యాన్సర్, గుండెజబ్బులు, మానసిక రుగ్మతల బారిన పడే అవకాశం ఉందని కూడా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి మంచి, చెడు.. లాభం, నష్టం కలగలసిన ఇంటర్నెట్‌ను ఏ రకంగా ఉపయోగించుకుంటే ఆ రకమైన ఫలితాలే వస్తాయని పరిశోధకులు సూచిస్తున్నారు.

Comments (3) »

ఇనుముకు తుప్పు ఎందుకు పడుతుందో తెలుసా?

ఇనుము తుప్పు పట్టేందుకు ముఖ్యకారణం ఆక్సిజన్. నీటిలో తడిసినప్పుడు కానీ, గాలిలోని నీటిఆవిరి చుట్టూ పేరుకున్నప్పుడు గానీ ఇనుము నీటితో చర్య జరుపుతుంది. అంటే ఇనుము (ఫెరస్-Fe) నీటి (H2O) లోని ఆక్సిజన్ (O2) ను తీసేసుకుని హైడ్రోజన్ (H2) ను గాల్లోకి వదిలేస్తుంది. ఇనుము, ఆక్సిజన్ రెండూ కలిసి ఫెర్రస్ ఆక్సైడ్ (తుప్పు) తయారై ఇనుముపై పేరుకుంటుంది. తుప్పు పొడిపొడిగా ఉండి మిగిలిన ఇనుముతో సంబంధంకలిగి ఉండదు. దాంతో రాలి కిందపడిపోతుంది. అంటే తుప్పుపడితే ఆ పదార్థం బరువు క్రమేపీ తగ్గుతూ కొన్ని రోజులకు పదార్థం మొత్తం విడిపోతుంది. దీనివల్లనే ఇనుపపదార్ధాలకు తుప్పు పట్టకుండా పెయింట్, నూనె, గ్రీజు లాంటివి పూస్తారు. ఇవి ఇనుముకు, నీరు-నీటిఆవిరికి మధ్యన ఉండి ఇనుము, ఆక్సిజన్ కలవకుండా చేస్తాయి.

Leave a comment »

సబ్బు జిడ్డును ఎలా వదిలిస్తుందో తెలుసా?

జిడ్డుని కడుక్కోవడానికి నీటిని కాకుండా నీటితో పాటు సబ్బును వాడతాం. సబ్బులు సాపోనిఫాకేషన్ అనే రసాయన ప్రక్రియలో క్రొవ్వు పదార్థాల జలవిచ్ఛేదం (హైడ్రాలసిన్) వల్ల పొటాషియం లేదా సోడియం ఆమ్ల లవణాలు తయారవుతాయి. నీళ్ళు, జిడ్డు లేదా నూనె-ఇవి రెండూ ఒకదానితో ఒకటి కరుగవు.

సబ్బు ఎమల్సిఫైర్‌గా పని చేసి, ఈ రెండిటినీ కలిసిపోయేటట్లు చేస్తుంది. అంటే నీటి తలతన్యతను తగ్గించడం ద్వారా జిడ్డు లేదా నూనె అణువులతో కలిసేటట్లు చేయడంతో మన చేతులకంటుకున్న జిడ్డు త్వరగా పోతుంది.

Leave a comment »

పిల్లల శరీరంలో పెద్దల కంటె ఎక్కువ ఎముకలు ఉంటాయి?

పెద్దవాళ్ల శరీరంలో ఎముకల సంఖ్య 206 అని చాలామందికి తెలిసే ఉంటుంది. కానీ పిల్లల శరీరంలో ఎముకల సంఖ్య వేరుగా ఉంటుందని తెలియకపోవచ్చు. పిల్లలు కాబట్టి పెద్ద వారిలో కంటె తక్కువ ఎముకలు ఉండొచ్చని అనుకుంటారు. కానీ పిల్లల శరీరంలో పెద్దవాళ్ల కంటె ఎక్కువ ఎముకలు ఉంటాయి.

పిల్లల్లో ఉండే ఎముకల సంఖ్య 300. అయితే పిల్లల శరీరం ఎదుగుతున్న కొద్దీ కొన్ని ఎముకలు ఒకదానితో ఒకటి కలిసిపోతాయి. కాబట్టి పెద్దయ్యాక 206 ఎముకలే ఉంటాయి. అయితే స్టెర్నమ్ అనే ఎముకను మూడు ఎముకలుగా భావించి లెక్కిస్తే పెద్ద వాళ్ల శరీరంలో 208 ఎముకలు ఉంటాయి. మానవ శరీరంలో ఉండే అతి చిన్న ఎముక చెవి మధ్య భాగంలో ఉంటుంది.

దీని పొడవు సుమారు 0.11 అంగుళాలు ఉంటుంది. మానవ శరీరంలో అతి పెద్దది, పొడవైనది ఫీమర్ అనే తొడ ఎముక. సగటు పురుషుని శరీరంలో ఫీమర్ ఎముక పొడవు సుమారు 48 సెంటీ మీటర్లు ఉంటుంది. ఫీమర్ ఎముక, కపాలంలో ఉండే టెంపోరెల్ అనే ఎముక శరీరంలోని ఎముకలన్నిటి కన్నా చాలా గట్టివి.

Leave a comment »

చంద్రమండలంలో ధ్వని ఎందుకు విన్పించదు?

ఏవేని రెండు వస్తువులు ఒకదానికొకటి తాకిడి జరిగినప్పుడు శబ్దం పుడుతుంది. అయితే కంపించే అన్ని వస్తువుల శబ్దాలను మనం వినలేం. మనం వినగలిగే శబ్దాలను శ్రావ్య ధ్వనులంటారు. శబ్దం యాంత్రిక తరంగం అవటం వలన దీని ప్రసారానికి యానకం కావాలి. అనగా ఘన, ద్రవ, వాయు పదార్థాలలో ఏదో ఒకటి ఉన్నప్పుడు మాత్రమే కంపనలో ధ్వని పుడుతుంది.

శూన్యంలో యానకం ఉండదు. కాబట్టి కంపనలు జరగవు. అందువల్ల ధ్వని పుట్టదు. కాబట్టి శూన్యంగా లేదా చంద్రునిపై శబ్దం వేగం సున్నా, అందుకే మనిషి చంద్రమండలం మీద మామూలుగా మాట్లాడటానికి వీలు కాదు. చప్పట్లు కొట్టినా, తుపాకి పేల్చినా వాటి శబ్దాలు మన చెవికి చేరవు. అందుకే చంద్రునిపై ధ్వని వినలేం అంటున్నారు పరిశోధకులు.

Leave a comment »

తామరాకు పైన ఎందుకు నీరు నిలువదు?

తామరాకు పైన నీరు నిలువదు. నీటిలో ఉన్నా తామారాకు తడవదు. నీరు ఆకు పైన తేలుతూ జారిపోతూ ఉంటుంది. ఇది చూచిన ప్రతి ఒక్కరికి ఎందుకు నీరు నిలవదు అన్న అనుమానం వస్తుంది కాదా! ‘తామారాకు మీద నీటిబొట్టు’ అనే సామెత వింటూ ఉంటాం కదా! తామారాకుల్లోని కణాలలో సెల్యులోజ్ అనే పదార్థం ఉంటుంది.

అది కొన్ని మార్పులు చెంది క్యూటికిల్ అనే పొరను ఏర్పరుస్తుంది. ఆ పొరను నున్నగా ఉండే ఆమ్లాలు, ఆల్కహాల్, కార్బన్ వంటి అణువులు ఉంటాయి. అవి నీటితో ఎలాంటి చర్యనూ జరపవు.

అందుకే తామరాకు నీటిలో తడవదు. క్యూటికిల్ పొర ఉన్న ఆకుపై పడే నీరు తలతన్యత కారణంగా గుండ్రటి బిందువులుగా మారుతుంది. బిందువులు నున్నగా జారిపోతాయి. అందుకే తామరాకు నీటిలో తడవదు, ఆకుపై పడిన నీరు నిలవదు.

Leave a comment »

మోటార్ సైకిల్‌ను ఎవరు కనుగొన్నారు?

నూటపాతికేళ్ల క్రితం మోటార్‌సైకిళ్ల గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. కొంతమంది అప్పటికే ప్రయోగాలు చేసి వాటిని తయారుచేసె ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే వాటికీ… ప్రస్తుత కాలంలోని మోటార్ బైక్‌లకీ… ఏ మాత్రం పోలికలు ఉండవు. 1885లో జర్మనీకి చెందిన గాటిలెబ్ డైమ్‌లర్ అనే వ్యక్తి ఇంటర్నల్ కంబషన్ ఇంజన్‌తో నడిచే మోటార్ సైకిల్‌ని రూపొందించాడు.

అంతకన్నా ముందే 1869లో మైకక్స్ పియరక్స్ అనే ఫ్రాన్స్ కంపెనీ వారు సైకిల్‌కి ఆవిరితో నడిచే ఇంజన్‌ను బిగించి మోటార్ సైకిల్‌లా నడిపారు. కానీ డైమ్‌లర్ తయారుచేసినదే ఎక్కువ ప్రాచుర్యం పొందింది. దాని అత్యధిక వేగం గంటకు 19 కిలోమీటర్లు. ఆధునిక బైక్‌లలో కొన్ని గంటకు 500 కిలోమీటర్లకు పైగా వేగంతో నడుస్తున్నాయి.

Leave a comment »

ఇసుక ఎలా ఏర్పడుతుందో తెలుసా

ఎడారులు, సముద్రాలు, నదులు, వాగులు, వంకలలో… ఇలా భూమి మీద ఎక్కడబడితే అక్కడ ఇసుక కనిపిస్తుంటుంది. మరి ఈ ఇసుక ఎక్కడనుంచి వస్తుందని కొంత వరకు చూస్తే ఎవరికీ తెలియదు. గాలి, వాన, మంచు, నీరు కారణంగా రాళ్లు, బండలు పగిలిపోయి అతి సన్నటి రేణువులుగా తయారవుతాయి.

అలా తయారయిన రేణువులే ఇసుకగా మారుతాయి. ఇసుకలో ఉండే ఖనిజ లవణాల శాతాన్ని బట్టి ఇసుక రంగు మారుతుంది. ఒక రాయి ఇసుకగా మారడానికి మిలియన్ల సంవత్సరాలు పడుతుంది.

Leave a comment »

అతిపెద్ద ముక్కు కలిగిన పక్షి.

సాధారణంగా పక్షులకు చిన్న ముక్కులు ఉండటాన్ని, కొంగలాంటి వాటికి ముక్కులు కాస్త పొడవుగా ఉండటాన్ని తెలుసు. కాని ఈ పక్షికి మాత్రం ముక్కు చాలా పొడవుగా ఉంటుందటా! అది ఏ పక్షో తెలుసా మీకు? ఆస్ట్రేలియన్ పెలికాన్ అనే పక్షి. దీనికి ముక్కు అత్యంత పొడవైనదని భావిస్తున్నారు. ఈ పక్షి ముక్కు పొడవు దాదాపు 47 సెంటీ మీటర్లు ఉంటుంది.

అయితే పక్షి శరీరంతో పోల్చి చూస్తే అత్యంత పొడవైన ముక్కు కలిగిన పక్షి స్వోర్డ్ బిల్‌డ్ హమ్మింగ్ బర్డ్ అని అంటున్నారు. కత్తి లాంటి ముక్కు ఉన్న ఈ పక్షి శరీరం పొడవు 13.5 సెంటీ మీటర్లు. మరి దాని ముక్కు పొడవు 10.5 సెంటీ మీటర్లు. అంటే కేవలం ముక్కు పొడవుకి, శరీరం పొడవుకి తేడా 2 సెంటీ మీటర్లే. అందుకే చూడటానికి శరీరం ఎంత పొడవు ఉంటుందో, ముక్కు కూడా అంతే పొడవు ఉన్నట్లుగా కనిపిస్తుంది.

Leave a comment »